జపాన్‌లోని ఒసాకా నగరంలో 2009లో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి కారణమైన సునావో టకామీని అధికారులు ఉరి తీశారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ శిక్ష అమలు, జపాన్ ప్రధాని టకైచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఉరిశిక్షగా నమోదైంది.

నిందితుడు సునావో టకామీ, జపాన్‌లో జూదం ఆడే యంత్రాలు ఉండే పచింకో పార్లర్‌లోకి వెళ్లి పెట్రోల్ చల్లి, మండుతున్న అగ్గిపుల్లను విసిరాడు. దీనివల్ల భవనం మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు.

ఈ ఘటనపై విచారణ జరిపిన ఒసాకా జిల్లా కోర్టు 2011లో టకామీకి మరణశిక్ష విధించింది. ఆ తర్వాత నిందితుడు వేసిన అప్పీళ్లను 2016లో జపాన్ సుప్రీం కోర్టు తిరస్కరించి, కింది కోర్టు ఇచ్చిన మరణశిక్షను ఖరారు చేసింది.

ఈ ఉరిశిక్షను అమలు చేయాలని తాను ఆదేశించినట్లు జపాన్ న్యాయశాఖ మంత్రి తెలిపారు. బాధితులు ఊహించలేనంత భయాన్ని, బాధను అనుభవించారని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం జపాన్‌లో మరణశిక్షను రద్దు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. విచారణ ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని కోరుతున్న నేపథ్యంలోనే ఈ ఉరిశిక్ష అమలు కావడం గమనార్హం.

58 ఏళ్ల టకామీపై హత్య, హత్యాయత్నం, అగ్ని ప్రమాదాన్ని సృష్టించడం వంటి నేరాలను కోర్టు ధ్రువీకరించింది. ఈ నేరాలన్నింటిలో దోషిగా తేలడంతోనే అతనికి మరణశిక్ష ఖరారైంది.