గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుంచి గెలిచిన అనిరుధ్‌రెడ్డి, అప్పటి నుంచి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను అంగీకరించకుంటే సీఎం చంద్రబాబును రాష్ట్రంలో తిరగనివ్వబోమని హెచ్చరించడం, పారిశ్రామిక వ్యర్థాలను వదిలే పరిశ్రమలను తగలబెడతానని అనడం వంటివి ఆయన దూకుడుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
రాష్ట్ర మంత్రులను కూడా రెండేళ్లకు ఒకసారి మార్చి యువతకు అవకాశం ఇవ్వాలని, రెండుసార్లు గెలిస్తే తాను కూడా సీఎం రేసులో ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అసెంబ్లీలో ఇప్పపువ్వు సారా ఆరోగ్యానికి మంచిదని, దాని కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరడం కూడా చర్చనీయాంశమైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన చేసిన డిమాండ్, ప్రతిపక్షాలకు సర్కారును విమర్శించే అవకాశం కల్పించిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను అనిరుధ్‌రెడ్డి సమర్థించడం గాంధీభవన్‌లో కలకలం రేపింది. రాజగోపాల్‌రెడ్డి అగ్నిపర్వతం వంటివారని, ఆయనకు మంత్రి పదవి కావాలని కోరడం లేదని అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పీసీసీని ఇరకాటంలోకి నెట్టాయి. ఇది ఆయన వ్యూహంలో భాగమా లేక ముక్కుసూటితనమా అనే దానిపై కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యల వల్ల పార్టీ, ప్రభుత్వం కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తన గురువు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అండతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని కొందరు అంటుండగా, అనిరుధ్‌రెడ్డి నైజం వల్లే ఇలా జరుగుతోందని సన్నిహితులు వాదిస్తున్నారు. కారణం ఏదైనా, ఆయన చేస్తున్న కామెంట్స్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి.








