రుత్విక్, విశాఖ ధిమాన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రాజా ది రాజా' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బృందావన్ క్రియేషన్స్ పతాకంపై కె.నిహారిక దాసరి నిర్మించిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు.

సినిమా విడుదలకు ముందు గురువారం చిత్ర బృందం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో రుత్విక్ మాట్లాడుతూ, ఈ సినిమాతో తన హీరో కావాలనే కల నెరవేరిందని చెప్పారు. టీమ్ అంతా ఎంతో పాషన్‌తో పనిచేశామని, ప్రీమియర్ షోలకు వచ్చిన స్పందన తమలో విజయంపై నమ్మకాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారు.

నిర్మాత కె.నిహారిక దాసరి మాట్లాడుతూ, వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని, ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయని దర్శకుడు అనిల్ బోయిడపు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.