మన తెలంగాణ/హైదరాబాద్: పాలిటెక్నిక్ నుంచి ఈసెట్ ద్వారా బీటెక్‌లో రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ పొందే అవకాశం యధాతధంగా కొనసాగుతుందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అవసరమైతే దీని పై స్పష్టత ఇస్తూ ప్రత్యేక జీవో కూడా తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థుల వద్దకు మంత్రి వివేక్ శుక్రవారం వెళ్లి వారి సమస్యలను ముఖాముఖి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి,
ఆధునిక సాంకేతిక విద్య, పరిశ్రమలతో అనుసంధానం, మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం విస్త్రత చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని భరోసా ఇచ్చారు. విద్య, ఫీజులు, పరీక్షలు, డిప్లొమా గుర్తింపు, ఈసెట్, లేటరల్ ఎంట్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్టయిఫండ్ వంటి అంశాలపై వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అలాగే పాలిటెక్నిక్‌లను శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావడంపై విద్యార్థుల్లో నెలకొన్న సందేహాలు, అపోహలు, ఆందోళనలను మంత్రి ఓపికగా విని ఒక్కొక్క అంశంపై స్పష్టత ఇచ్చారు.
ఏఐసీటీఈ గుర్తింపు, పరీక్షలు, డిప్లొమా సర్టిఫికెట్ అన్నీ కొనసాగుతాయని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని విద్యార్థులకు మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రశ్నల్లో భాగంగా ఫీజు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతం ఉన్న ఫీజు కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు విద్యార్థులకు స్టైఫండ్ అందించే అంశాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. మీపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూస్తామని వివరించారు. అలాగే కళాశాలల ప్రైవేటీకరణ అనే ప్రశ్నే లేదని, పాలిటెక్నిక్లు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని భరోసా ఇచ్చారు. గవర్నమెంట్ కంట్రోల్లోనే విద్య, పరీక్షలు, ఫీజులు, విద్యార్థుల ప్రయోజనాలు కొనసాగుతాయని వెల్లడించారు. పరిశ్రమలను భాగస్వామ్యం చేయాలనుకుంటున్నది ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక శిక్షణ, సీఎస్‌ఆర్ నిధులు తీసుకురావడం కోసం మాత్రమేనని తెలిపారు. ఇంకా పలు అంశాలను మంత్రి వివరించారు.








