మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా, ఇరాన్ దేశాల మధ్య ప్రమాదకరమైన సైనిక సహకారం కొనసాగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. రష్యా తన ఉపగ్రహాల ద్వారా గల్ఫ్ దేశాలు మరియు అమెరికా సైనిక స్థావరాలపై నిఘా పెట్టి, ఆ సమాచారాన్ని ఇరాన్‌కు అందిస్తోందని ఆయన వెల్లడించారు.

జూలై ప్రారంభం నుంచి రష్యా శాటిలైట్లు ఈ ప్రాంతాలపై నిఘా పెంచినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ముఖ్యంగా జూలై 19, 20 తేదీల్లో బహ్రెయిన్, జోర్డాన్, కువైట్‌లలోని నాలుగు కీలక వైమానిక స్థావరాలపై రష్యా ఉపగ్రహాలు నిఘా ఉంచినట్లు జెలెన్ స్కీ వివరించారు. రష్యా తీస్తున్న ఈ చిత్రాలు, ఇరాన్ జరిపే దాడులకు ముందు లక్ష్యాలను ఖరారు చేసుకోవడానికి, దాడుల తర్వాత జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ ముప్పును వెంటనే అడ్డుకోకపోతే ప్రపంచ శాంతికి తీరని నష్టం వాటిల్లుతుందని జెలెన్ స్కీ హెచ్చరించారు. రష్యా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ రహస్య మద్దతును నిలువరించేందుకు, తమ వద్ద ఉన్న ఆధారాలను భాగస్వామ్య దేశాలతో పంచుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.