ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఆయతుల్లా ఖమేనీ మరణించిన తర్వాత మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, అప్పటి నుంచి ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు, కనీసం తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. దీంతో ఆయన జీవించి ఉన్నారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, అధ్యక్షుడు పెజెష్కియన్ మొజ్తబా ఖమేనీని కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించారు. తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని హెచ్చరించడంతో, ఖమేనీ కార్యాలయం భేటీకి అంగీకరించింది. అయితే, సంప్రదాయానికి భిన్నంగా నివాసంలో కాకుండా, ఒక రహస్య ప్రదేశంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

భద్రతా సిబ్బంది పెజెష్కియన్‌ను టెహ్రాన్‌లోని ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి, టింటెడ్ అద్దాలు ఉన్న కారులోకి ఎక్కించారు. అక్కడ చీకటిగా ఉండటంతో ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేకపోయారు. కేవలం కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో, పెజెష్కియన్‌ను భద్రతా సిబ్బంది కనీసం చేతులు కలిపేందుకు కూడా అనుమతించలేదు. ఈ భేటీ తర్వాత, తాను కలిసింది నిజంగానే మొజ్తబా ఖమేనీయేనా అని పెజెష్కియన్ సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ సమావేశం తనను అవమానించినట్లుగా ఉందని పెజెష్కియన్ భావించారు. ఆ తర్వాత ఖమేనీ నివాసంలో మరోసారి భేటీ కావాలని ఆయన కోరినా, ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ఖమేనీతో మాట్లాడటం చాలా కష్టమని పెజెష్కియన్ వ్యాఖ్యానించారు. మరోవైపు, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ, ఇరాన్ ప్రధాన నాయకులు చనిపోయారని, ఖమేనీ వెళ్లిపోయారని, ఆయన కుమారుడు మొజ్తబా కూడా 90 శాతం అంతమైపోయారని పేర్కొన్నారు.