ఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఈ సదస్సులో 'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026' ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇది భారతదేశానికి పెద్ద దౌత్యపరమైన విజయంగా నిలిచింది. సదస్సు ముగింపులో రష్యా, చైనా నేతలతో కలిసి మోదీ దిగిన ఫ్యామిలీ ఫొటో, బ్రిక్స్ దేశాల ఐక్యతను చాటిచెప్పింది.

ప్రధాని మోదీ కేవలం మూడు రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో సహా 15 మంది నేతలతో కీలక చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడితో జరిగిన భేటీలో 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించారు.

ఏడేళ్ల తర్వాత భారత్ వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యారు. వీరిద్దరూ సరిహద్దు భద్రత, రెండు దేశాల మధ్య సంబంధాల గురించి చర్చించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్, ఐక్యరాజ్యసమితి (UN) చీఫ్ గుటెర్సెస్‌లతో కూడా మోదీ సమావేశమై ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా మండలి సంస్కరణల గురించి మాట్లాడారు.

ఇథియోపియా, మలేషియా, యూఏఈ, వియత్నాం దేశాల నేతలతో కూడా ప్రధాని చర్చలు జరిపారు. ఇరాన్, యూఏఈ మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి డిక్లరేషన్‌పై అందరూ ఏకాభిప్రాయానికి రావడం గమనార్హం. సదస్సు ముగిసే ముందు ఇండోనేసియా, సౌతాఫ్రికా, ఈజిప్ట్ దేశాల అధినేతలతో కూడా మోదీ సమావేశమయ్యారు.