నటుడు గిరిబాబు తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన కుమారుడు రఘుబాబు వివరించారు. 1990లో తన తమ్ముడిని హీరోగా పరిచయం చేస్తూ గిరిబాబు 'ఇంద్రజిత్' అనే సినిమాను నిర్మించారు.
ఆ సినిమా కోసం అప్పట్లోనే 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇది 35 ఏళ్ల క్రితం ఒక కొత్త హీరో కోసం పెట్టిన భారీ బడ్జెట్ అని, ఇప్పటి లెక్కల ప్రకారం అది దాదాపు 500 కోట్ల రూపాయలతో సమానమని రఘుబాబు చెప్పారు. సినిమాకు మంచి పేరు వచ్చినప్పటికీ, రావాల్సిన ఆదాయం రాకపోవడంతో కుటుంబం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.
ఈ సినిమా కారణంగా తమ కుటుంబం 33 లక్షల రూపాయల అప్పుల్లో చిక్కుకుందని రఘుబాబు తెలిపారు. అప్పట్లో గిరిబాబుకు ఉన్న మంచి పేరు, నమ్మకం (గుడ్‌విల్) కారణంగా ఫైటర్స్ యూనియన్, కెమెరా డిపార్ట్‌మెంట్, ప్రసాద్ ల్యాబ్, జెమినీ కిరణ్ వంటి వారు సగం డబ్బులు తీసుకుని సినిమా విడుదలకు సహకరించారు.
అయితే, ఎవ్వరూ తమ ఇంటికి వచ్చి అప్పు అడగకూడదనే ఉద్దేశంతో గిరిబాబు కఠిన నిర్ణయం తీసుకున్నారు. మద్రాసులో తాను 20-25 ఏళ్లుగా కష్టపడి సంపాదించిన ఆస్తులన్నింటినీ అమ్మి, వడ్డీతో సహా అప్పులన్నీ తీర్చేశారు. ఎవరికీ ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా చూడటం తమ కుటుంబానికి ఒక గొప్ప చరిత్ర అని రఘుబాబు పేర్కొన్నారు.
ఆర్థికంగా దెబ్బతిన్న సమయంలో తాను చదువు పూర్తి చేయలేకపోయానని, మళ్లీ సినిమా తీయడానికి పెట్టుబడి లేక ఇబ్బంది పడ్డానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎవరి ముందు చేయి చాచి అడగకూడదనే సిద్ధాంతాన్ని తాము తండ్రి నుంచి నేర్చుకున్నామని రఘుబాబు చెప్పారు.








