కన్నడ స్టార్ హీరో డాలీ ధనంజయ, తన భార్య ధన్యతతో కలిసి కుమారుడి నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించారు. గతేడాది ఫిబ్రవరిలో డాక్టర్ ధన్యతను వివాహం చేసుకున్న ధనంజయ దంపతులకు, ఈ ఏడాది మే నెలలో మగ బిడ్డ జన్మించారు.
వినాయక చవితి పండగ రోజున తమ కుమారుడి పేరును ధనంజయ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ బిడ్డకు ‘ఎరెయ’ అని పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు కూడా చెప్పారు.
ఎరెయ అనే పదానికి ప్రాచీన కన్నడ సంప్రదాయంలో యజమాని, స్వామి, అధిపతి అని అర్థాలు ఉన్నాయని ధనంజయ వివరించారు. ఒకప్పుడు రాజులను, చక్రవర్తులను గౌరవించేందుకు ఈ పదాన్ని వాడేవారని ఆయన పేర్కొన్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం, చాళుక్య రాజు ఇమ్మడి పులకేశి చిన్ననాటి పేరు కూడా ఎరెయ అని ఆయన గుర్తు చేశారు.
తమ కుమారుడు తమ జీవితంలో చిన్న అధిపతి అని, హృదయానికి రాజు అని ధనంజయ సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డ ఫొటోలను చూసి ఆశీర్వదించాలని ఆయన అభిమానులను కోరారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించాయి.
తెలుగు ప్రేక్షకులకు డాలీ ధనంజయ సుపరిచితమైన నటుడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాల్లో జాలి రెడ్డి పాత్రతో ఆయన మంచి గుర్తింపు పొందారు. సత్యదేవ్ నటించిన జీబ్రా, శివ కార్తికేయన్ పరాశక్తి సినిమాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు.
ధనంజయ దంపతుల పోస్ట్‌పై సినీ ప్రముఖులు, అభిమానులు స్పందిస్తున్నారు. నెటిజన్లు పెద్ద ఎత్తున వారికి అభినందనలు తెలుపుతూ, చిన్నారిని మనసారా ఆశీర్వదిస్తున్నారు.








