చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర ప్రారంభమైంది. వర్ష రుతువులో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను రక్షించాలని కోరుతూ, అమ్మవారికి భక్తులు సామూహికంగా బోనాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో, దీనికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది.

ఈ జాతర వెనుక రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1813లో కలరా మహమ్మారి ప్రబలినప్పుడు సికింద్రాబాద్‌లో ఉజ్జయిని అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 1908లో మూసీ నది వరదల సమయంలో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని ప్రార్థించడం ద్వారా ఈ జాతర పాతబస్తీలో విస్తరించింది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో నగరంలో జాతర ప్రక్రియ మొదలవుతుంది.

గోల్కొండలో ఆషాఢం తొలి గురువారం లేదా ఆదివారం ప్రారంభమయ్యే జాతర, సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో పదిహేను రోజుల పాటు కొనసాగుతుంది. పాతబస్తీలో మూడో ఆదివారం మొదలై నాలుగో సోమవారంతో ముగుస్తుంది. నగరవ్యాప్తంగా సుమారు 3 వేలకు పైగా దేవాలయాల్లో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, పలహారపు బండ్ల ఊరేగింపులు ఈ జాతరలో ప్రధాన ఆకర్షణలు.

సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో జాతర జరిగే 3 వేలకు పైగా దేవాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.