హైదరాబాద్ లడ్డూ వేలం చరిత్రలో బండ్లగూడలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ సొసైటీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక్కడ వేలం వేసిన 5 కిలోల లడ్డూ ప్రసాదాన్ని నివాసితులంతా కలిసి గ్రూపుగా పాల్గొని 1.01 కోట్ల రూపాయల భారీ ధరకు దక్కించుకున్నారు. గత ఏడాది ఇదే లడ్డూ 2.32 కోట్ల రూపాయలు పలికిన విషయం తెలిసిందే.

తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రక బాలాపూర్ లడ్డూ వేలంలో కూడా ఈసారి ఆల్-టైమ్ రికార్డు నమోదైంది. అర్బన్ రియాల్టీ గ్రూప్ వ్యవస్థాపకుడు సామ ప్రణీత్ రెడ్డి 21 కిలోల బంగారు పూత పూసిన లడ్డూను 39 లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. 1994లో కేవలం 450 రూపాయలతో మొదలైన బాలాపూర్ లడ్డూ వేలం ప్రస్థానం ఇప్పుడు 39 లక్షల రూపాయలకు చేరడం విశేషం.

నగరంలోని లగ్జరీ రెసిడెన్షియల్ కమ్యూనిటీలు కూడా వేలంలో పోటీపడ్డాయి. అరో రియాల్టీకి చెందిన ది కోహినూర్ ప్రాజెక్టులో భక్తులు పోటీపడి లడ్డూను 30.50 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు.

ఐటీ కారిడార్‌లోని మై హోమ్ భూజా గేటెడ్ కమ్యూనిటీలో కూడా లడ్డూ వేలానికి విపరీతమైన పోటీ నెలకొంది. ఈ ఏడాది ఇక్కడి లడ్డూ ప్రసాదం 25 లక్షల రూపాయల ధర పలికి టాప్ 4 స్థానంలో నిలిచింది.

టాప్ 5 లడ్డూల జాబితాలో మై హోమ్ మంగళ అపార్ట్‌మెంట్స్ కూడా చోటు దక్కించుకుంది. ఇక్కడ నివాసితులు, భక్తులు హోరాహోరీగా పోటీపడటంతో గణేష్ ప్రసాదం 21.11 లక్షల రూపాయల మార్కును అందుకుంది.