హైదరాబాద్ మాదాపూర్‌లోని HITEX ఎగ్జిబిషన్ సెంటర్‌లో HIMTEX 2026 (హైదరాబాదు ఇంటర్నేషనల్ మెషిన్ టూల్ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్) తొమ్మిదవ ఎడిషన్‌ను ఏస్ అర్బన్ గ్రూప్, ఏఎం గ్రీన్ డైరెక్టర్ స్వాతి చలమశెట్టి మరియు ఎంఎస్ఎంఈ డీఎఫ్ఓ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్యాలయం) హైదరాబాద్ అదనపు డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్ ప్రారంభించారు.

ఈ ఐదు రోజుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 300 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. మెషిన్ టూల్స్, రోబోటిక్స్, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ మరియు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అంటే యంత్రాల ద్వారా పారిశ్రామిక పనులను ఆటోమేటిక్‌గా చేసే సాంకేతికతలో వస్తున్న మార్పులను వీరు ప్రదర్శిస్తున్నారు.

ఈ ఎగ్జిబిషన్‌కు దేశవ్యాప్తంగా 20,000 మందికి పైగా సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. తయారీ రంగంలోని ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమల నిర్ణయకర్తలు ఒకే చోట చేరడం ద్వారా కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఇది వేదికగా నిలుస్తోంది.

తయారీ రంగంలో అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోవడంతో పాటు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల తయారీ రంగాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎగ్జిబిషన్ కీలక పాత్ర పోషిస్తోందని HITEX డైరెక్టర్ కున శంకర్ తెలిపారు.

ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రదర్శన ఆగస్టు 24 వరకు కొనసాగుతుంది. ఈ ఐదు రోజుల పాటు పారిశ్రామిక రంగంలోని తాజా పురోగతులపై నిపుణులు చర్చించనున్నారు.