దారుసలామ్ ప్రధాన రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి, అక్కడ జరుగుతున్న నాలా నిర్మాణ పనుల వల్ల అదుపుతప్పి కాలువలో పడిపోయారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతడిని చూసిన స్థానికులు వెంటనే నాలాలోకి దిగి, ప్రాణాపాయం నుంచి కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఈ ప్రాంతంలో జరుగుతున్న నాలా పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని, దీనివల్ల వాహనదారులు, స్థానికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనుల్లో జాప్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా గతంలో BRS పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసినా అధికారుల్లో మార్పు రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై నగర ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసానికి వెళ్లి స్థానికులు, వ్యాపారులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వారు వాపోయారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, పెండింగ్‌లో ఉన్న నాలా పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.