సైబర్ నేరగాళ్లు అడిగినంత డబ్బు చెల్లించినా కంపెనీలకు భద్రత ఉండటం లేదని ప్రూఫ్‌పాయింట్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మొత్తం 953 కంపెనీలపై జరిపిన ఈ అధ్యయనంలో, దాదాపు మూడో వంతు సంస్థలు ఒకసారి డబ్బులు చెల్లించిన తర్వాత కూడా రెండోసారి హ్యాకర్ల నుంచి డిమాండ్లను ఎదుర్కొన్నట్లు తేలింది.
ముఖ్యంగా కంపెనీల నుంచి దొంగిలించిన డేటాను తమ వద్దే ఉంచుకుని, దానిని బహిర్గతం చేస్తామని బెదిరిస్తూ హ్యాకర్లు మళ్లీ డబ్బులు వసూలు చేస్తున్నారు.
డబ్బులు చెల్లించినా హ్యాకర్లు డేటాను తిరిగి ఇచ్చేస్తారనే గ్యారెంటీ లేదని సెక్యూరిటీ పరిశోధకులు చాలా కాలంగా అనుమానిస్తున్నారు. తాజాగా జరిగిన కొన్ని ఘటనలు ఈ విషయాన్ని నిజం చేశాయి. హ్యాకర్లకు లొంగిపోయి డబ్బులు చెల్లించడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, మరింత దోపిడీకి దారితీసే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.







