కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లలో లభించే ఉచిత వై-ఫై కనెక్షన్లను ఉపయోగించడం ప్రమాదకరంగా మారింది. సాధారణ వై-ఫై ముసుగులో సైబర్ నేరగాళ్లు వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్నట్లు భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా క్యాప్టివ్ క్రంచ్ అనే పద్ధతి ద్వారా ఈ దాడులు జరుగుతున్నాయి.

మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ పరిశోధనల ప్రకారం, ఫిబ్రవరి 2026 నుంచి స్టార్మ్-2945 అనే హ్యాకింగ్ గ్రూపు ఈ దాడులకు పాల్పడుతోంది. రష్యా ప్రభుత్వ మద్దతు ఉన్న ఈ సంస్థ, హోటళ్లలోని వై-ఫై నెట్‌వర్క్‌లను హ్యాక్ చేసి, వినియోగదారులను నకిలీ వెబ్‌సైట్లకు మళ్లిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ సర్వీసులను పోలి ఉండే డొమైన్లను సృష్టించి, ఇంటర్నెట్ కనెక్షన్‌లో సమస్య ఉందని వినియోగదారులను నమ్మిస్తారు.

సమస్యను పరిష్కరించే పేరుతో సాఫ్ట్‌వేర్ లేదా బ్రౌజర్ అప్‌డేట్ చేయాలని హ్యాకర్లు కోరుతారు. వినియోగదారులు ఆ నకిలీ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసిన వెంటనే, సిస్టమ్‌లో మాల్‌వేర్ లేదా రిమోట్ యాక్సెస్ ట్రోజన్ ఇన్‌స్టాల్ అవుతుంది. దీనివల్ల హ్యాకర్లు డివైజ్ కంట్రోల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత డేటాను దొంగిలించడమే కాకుండా కెమెరా, మైక్రోఫోన్ ద్వారా ఆడియో, వీడియోలను రికార్డ్ చేసే అవకాశం ఉంది.

డిజిటల్ భద్రత కోసం కంప్యూటర్, మొబైల్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను వాడటం ఉత్తమం. అనుమానాస్పద లింకులు, ఫేక్ లాగిన్ పేజీలు, తెలియని డౌన్‌లోడ్స్‌కు దూరంగా ఉండటం ద్వారా ఇటువంటి సైబర్ దాడుల నుంచి రక్షణ పొందవచ్చు.