ఒకప్పుడు టాలీవుడ్ నిర్మాతలు హీరోలు, దర్శకులకు అడ్వాన్స్‌లు ఇచ్చి డేట్స్ లాక్ చేసుకునేవారు. అయితే, ఈ పద్ధతిలో ప్రాజెక్టులు ఆలస్యం కావడం, కొన్నిసార్లు సినిమానే పట్టాలెక్కకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలు ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బందులు పడేవారని నాగవంశీ పేర్కొన్నారు.

ప్రస్తుతం పరిస్థితి మారిందని, నిర్మాతలు ఇస్తామన్నా హీరోలు అడ్వాన్స్‌లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని ఆయన చెప్పారు. సినిమా ఓకే అయిన తర్వాత, షూటింగ్ ప్రారంభానికి ముందు కొంత, ఒక షెడ్యూల్ పూర్తయ్యాక కొంత, మిగిలిన మొత్తాన్ని షూట్ మొత్తం ముగిశాక ఇవ్వాలని హీరోలు నిబంధనలు పెడుతున్నారు.

హీరోలు అడ్వాన్స్‌లు తీసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులను కూడా ఆయన వివరించారు. ఒక నిర్మాతకు మాట ఇచ్చి అడ్వాన్స్ తీసుకుంటే, ఆ తర్వాత వేరే సంస్థ నుంచి మంచి కథ లేదా నచ్చిన దర్శకుడు వస్తే హీరోలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొహమాటానికి సినిమా చేయాల్సి రాకూడదనే ఉద్దేశంతోనే హీరోలు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.

ఈ మార్పు ఇండస్ట్రీకి మంచిదని నాగవంశీ అభిప్రాయపడ్డారు. సినిమా మొదలయ్యే సమయంపై స్పష్టత లేని పాత పద్ధతి కంటే, సినిమా ఖరారయ్యాక పారితోషికం తీసుకునే విధానం నిర్మాతలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.