మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో హరికృష్ణపై మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడంపై వచ్చిన కథనాల నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఈ కేసులో నిందితుడైన హరికృష్ణను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపారు. ఫిర్యాదులో డబ్బుల వ్యవహారం ఉండటంతో వివరాల సేకరణలో జాప్యం జరిగిందని, అందుకే ఎఫ్‌ఐఆర్ నమోదు ఆలస్యమైందని ఆయన వివరించారు.
ఈ మొత్తం భూదందా వ్యవహారంలో ముఖ్యమంత్రి కోటరీలో కీలక వ్యక్తిగా ఉన్న కిరణ్ ప్రధాన సూత్రధారి అని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజాంపేటలో ఐదెకరాల భూ వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి, మంత్రులు మరియు అధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి హరికృష్ణ వసూళ్లకు పాల్పడినట్లు మధుసూదన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరణ్‌ను ఎవరూ ప్రశ్నించకపోవడం వెనుక సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయనే ప్రచారం సైబరాబాద్ కమిషనరేట్‌లో వినిపిస్తోంది.
నిజాంపేటతో పాటు జనగామ, భూపాలపల్లి, భువనగిరి ప్రాంతాల్లో మరియు ఒక ప్రతిపక్ష పార్టీ నేత వద్ద ఎన్‌వోసీలు ఇప్పిస్తానని హరికృష్ణ కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. ఈ భూదందాకు సంబంధించి మరిన్ని వివరాలను నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో ఉన్నతాధికారులే గతంలో బాధితుడికి, నిందితుడికి సలహాలు ఇచ్చి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని, తాజాగా ఫిర్యాదు రావడంతో హడావిడిగా కేసు నమోదు చేశారని తెలుస్తోంది.








