ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్ ఒప్పందం కోసం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు సీఎస్కే సిద్ధమైంది. దీనికి ప్రతిఫలంగా శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్‌లతో పాటు రూ. 10 కోట్ల నగదును ఇచ్చేందుకు సీఎస్కే ఆఫర్ ఇచ్చింది.
అయితే, ఈ డీల్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యువ బ్యాటర్ ఆయుష్ మహాత్రేను కోరుతోంది. శివమ్ దూబే, ఆయుష్ మహాత్రేలను ఇస్తేనే హార్దిక్ పాండ్యాను వదులుకుంటామని ముంబై యాజమాన్యం స్పష్టం చేసింది. రోహిత్ శర్మ శైలిలో బ్యాటింగ్ చేస్తున్న ఆయుష్ మహాత్రేను భవిష్యత్తు స్టార్‌గా భావిస్తున్న ముంబై, అతడిని దక్కించుకోవాలని పట్టుబడుతోంది.
మరోవైపు, ఆయుష్ మహాత్రేను వదులుకునే ప్రసక్తే లేదని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఖండించింది. జట్టు భవిష్యత్తుకు ఆయుష్ మహాత్రే కీలక ఆస్తి అని సీఎస్కే భావిస్తోంది. దీంతో సీఎస్కే ఇచ్చిన భారీ ప్రతిపాదనను ముంబై ఇండియన్స్ తిరస్కరించింది.
ప్రస్తుతం ఈ మెగా ట్రేడ్ ఆయుష్ మహాత్రే చుట్టూనే తిరుగుతోంది. ముంబై ఇండియన్స్ పట్టుదలతో ఉండటంతో, ఈ చారిత్రాత్మక ఒప్పందం ఖరారవుతుందా లేదా చర్చలు విఫలమవుతాయా అనేది వేచి చూడాలి.






