మెహిదీపట్నం, వెలుగు: చారిత్రక గోల్కొండ కోట పరిధిలోని పటాన్‌చెరు దర్వాజా సమీపంలో , కుతుబ్‌షాహీ శ్మశానవాటిక దగ్గర ఉన్న 'అఠారా సీడీ' వద్ద గురువారం సాయంత్రం ఆర్మీ తవ్వకాల్లో భూగర్భంలో ఓ నిర్మాణం బయటపడింది. అయితే, ఇది సొరంగం అని, ఇక్కడి నుంచి చార్మినార్ కు డైరెక్ట్దారి ఉందంటూ సోషల్మీడియాలో విస్తృత ప్రచారం సాగింది. అయితే, విషయం తెలుసుకున్న పురావస్తు శాఖ అధికారులు రంగ ప్రవేశం చేసి ఆ నిర్మాణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు అది గోల్కొండ పాలకుల కాలంలో ఉపయోగించిన ఒక సీక్రెట్గది అని తేల్చారు.
సీక్రెట్రూమ్బయటపడిన ప్రాంతం చుట్టుపక్కల ఖాళీ మైదానం ఉండడంతో పిల్లలు క్రికెట్ఆడడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే, రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం ఉంది. దీంతో పక్కనే ఆర్టిలరీ సెంటర్ ఉండడంతో ఆర్మీ రంగ ప్రవేశం చేసింది. అగ్నివీర్ శిక్షణ కోసం ఉపయోగించేందుకు ఇక్కడి చెట్లను తొలగించి స్థలాన్ని చదును చేసే పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఒకచోట తవ్వుతుండగా ఈ నిర్మాణం బయటపడింది. విషయం తెలియడంతో స్థానికులు, ప్రజలు అక్కడకు భారీగా తరలివచ్చారు. సోషల్ మీడియాలో వార్తలు వైరల్కావడంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ఇండియా అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.
అధికారులు పరిశోధించి ఆ నిర్మాణం సొరంగం మాత్రం కాదని, స్టోరేజ్ ఛాంబర్ లేక బంకర్అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయి పరిశోధన తర్వాత అసలు విషయం తెలుస్తుందన్నారు. బయటపడిన రూమ్1.2 మీటర్ల వెడల్పు, 1.8 మీటర్ల పొడవు, 2.2 మీటర్ల లోతుతో రెక్టాంగెల్షేప్లో ఉందని ప్రకటించారు. గ్రానైట్ రాళ్లతో నిర్మించారని, ఇంటీరియర్ గోడల మాదిరిగా చుట్టూ సాధారణ రాళ్లను పేర్చారని పేర్కొన్నారు. ఈ ప్రాంతం చాలా ఎత్తులో ఉండడంతో లోపలి కోట గోడలు, దారులు మూసుకుపోయాయని అంటున్నారు. గతంలో మధ్య యుగానికి చెందిన కొన్ని ఎరుపు రంగు మట్టి పాత్రల శకలాలు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో దొరికాయని స్పష్టం చేశారు. తమ పరిశోధన పూర్తయ్యేంత వరకు భూమిని చదును చేసే పనులను ఆపాలని ఆర్మీ అధికారులను పురావస్తు శాఖ విజ్ఞప్తి చేసింది.
ఈ స్థలం తమకు సంబంధించినదని పురావస్తు శాఖ వాదిస్తుండగా, కాదు కాదు తమదే అంటూ కేంద్ర రక్షణ శాఖ అధికారులు వాదిస్తున్నారు. ఈసారి కూడా అదే వివాదం ఉండడంతో అధికారులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, గోల్కొండ తహసీల్దార్ప్రవీణ్, గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదులు పరిశీలించారు. స్థల వివాదం ఆ రెండు వర్గాలే కూర్చుని పరిష్కరించుకుంటారని తహసీల్దార్పేర్కొన్నారు.








