జూలై 20న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. సోనియా గాంధీ నివాసంలో జరిగిన వ్యూహ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, జైరాం రమేష్, పి.చిదంబరం, శశి థరూర్ సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం, నీట్ ప్రశ్నాపత్రాల లీక్, విద్యా వ్యవస్థలో లోపాలు, ధరల పెరుగుదల, విదేశాంగ వైఫల్యాలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పార్టీ నిర్ణయించింది.
రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో కాంగ్రెస్ తన వ్యతిరేకతను స్పష్టం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుతో పాటు, 30 రోజుల జైలు శిక్ష పడిన మంత్రులు, ముఖ్యమంత్రులను పదవుల నుంచి తొలగించే ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని జైరాం రమేష్ ప్రకటించారు. ఏప్రిల్ 17న ప్రభుత్వం రెండు మూడవ వంతు మెజారిటీ సాధించడంలో విఫలమైందని, ఇప్పుడు మళ్లీ అదే బిల్లులను తీసుకురావడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై కూడా కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ కోసం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ), వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లులను పూర్తిగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుత లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే మాత్రం మద్దతు ఇస్తామని పేర్కొంది.
మరోవైపు పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపనుంది. అలాగే సోమవారం ఇండియా కూటమి నేతలు తమ తదుపరి కార్యాచరణపై సమావేశం కానున్నారు. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో కీలక బిల్లులపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది.








