భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సహకార సంఘం కార్యాలయంలో సోమవారం యూరియా విక్రయాల సందర్భంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. యూరియా బస్తా అసలు ధర రూ.257 ఉండగా, సొసైటీ సిబ్బంది రూ.315కు విక్రయిస్తున్నారు. ఇందులో రూ.35 రవాణా చార్జీల కింద అదనంగా వసూలు చేస్తున్నట్లు సిబ్బంది స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చార్జీలను వసూలు చేస్తున్నామని సొసైటీ సిబ్బంది చెబుతున్నారు. అయితే, గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులపై ఇలా రవాణా చార్జీల భారాన్ని మోపలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు.
ఈ క్లిష్ట సమయంలో రవాణా చార్జీల పేరుతో అదనపు భారం వేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, రైతులపై మోపిన ఈ రవాణా చార్జీలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.








