హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో ఆర్థోపెడిక్ (ఎముకల విభాగానికి సంబంధించిన) చికిత్స పొందుతున్న నలుగురు రోగులకు శుక్రవారం శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు నిర్ణయించారు. రోగులను ఆపరేషన్ థియేటర్ వరకు తీసుకెళ్లినప్పటికీ, అక్కడ అనస్థీషియా మందులు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్లు వాయిదా వేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

దవాఖానలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డీఎంఈ (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) అధికారిగా పదోన్నతి పొంది వెళ్లడంతో, ఆ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేకపోవడం, ఉన్న ఇన్‌చార్జ్ అధికారుల మధ్య సమన్వయ లోపం సమస్యలను పెంచుతోందని రోగులు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని రోగులు వాపోతున్నారు. శస్త్రచికిత్సలకు అవసరమైన మందులు, సర్జికల్ వస్తువులు, ఇంజెక్షన్ల కొరతతో రోగులు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ ఆరోపణలను దవాఖాన యాజమాన్యం తోసిపుచ్చింది. గాంధీ దవాఖానలో శస్త్రచికిత్సలకు ఎలాంటి ఆటంకాలు లేవని, శుక్రవారం యథావిధిగా అత్యవసర ఆపరేషన్లు నిర్వహించామని అధికారులు స్పష్టం చేశారు. రాఖీ పండుగ, వరుస సెలవుల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడిందని, అందుకే అత్యవసరం కాని కొన్ని సర్జరీలను వాయిదా వేసి ఉండవచ్చని వారు తెలిపారు. అనస్థీషియా మందుల కొరత లేదని దవాఖాన వర్గాలు పేర్కొన్నాయి.