ఆగస్టు 15 నుంచి 30 వరకు నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా జరగనున్న FIH హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషులు, మహిళల జట్లు కాషాయ రంగు జెర్సీలతో ఆడనున్నాయి. ఏళ్లుగా భారత హాకీ జట్టుకు గుర్తింపుగా ఉన్న నీలం రంగు జెర్సీకి స్వస్తి పలుకుతూ, హాకీ ఇండియా ఈ కొత్త నిర్ణయం తీసుకుంది.
ఈ మార్పుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ కెప్టెన్ వీరెన్ రస్క్విన్హా స్పందిస్తూ, బ్లూ జెర్సీ భారత జట్టుకు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఎక్కువగా నీలం రంగు సింథటిక్ టర్ఫ్ మైదానాల్లో జరుగుతుండటంతో, ఆటగాళ్లను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని హాకీ ఇండియా వివరించింది. కోచ్‌లు, ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌తో చర్చించిన తర్వాతే సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కొత్త జెర్సీలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అశోక చక్రం స్ఫూర్తితో నేవీ బ్లూ ఆకృతులు, సుదర్శన చక్రం గ్రాఫిక్స్‌ను పొందుపరిచారు. జెర్సీ ముందు భాగంలో ‘INDIA’ అని దేవనాగరి శైలిలో ముద్రించారు. కాషాయంతో పాటు ప్రత్యామ్నాయంగా తెలుపు రంగు జెర్సీని కూడా హాకీ ఇండియా విడుదల చేసింది. ప్రత్యర్థి జట్టు జెర్సీ రంగును బట్టి వీటిని ఉపయోగించనున్నారు.
హాకీ ఇండియా ప్రకారం, కాషాయ రంగు ధైర్యం, త్యాగం, విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది సాంకేతిక అవసరాలను తీర్చడమే కాకుండా, ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని కూడా చాటిచెబుతుందని పేర్కొంది.








