ఆస్ట్రేలియా హోం అఫైర్స్ శాఖ (దేశ అంతర్గత భద్రతను చూసే విభాగం) గణాంకాల ప్రకారం, 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి వచ్చిన విద్యార్థి వీసా దరఖాస్తుల్లో 40 శాతానికి పైగా తిరస్కరణకు గురయ్యాయి. 2016 జూన్‌లో కేవలం 7.9 శాతంగా ఉన్న వీసా తిరస్కరణ రేటు, 2026 జూన్ నాటికి 24.2 శాతానికి పెరిగింది. నేపాల్ విద్యార్థుల విషయంలో ఈ తిరస్కరణ రేటు సగానికి పైగా ఉండగా, చైనా విద్యార్థుల దరఖాస్తుల్లో 5.8 శాతం మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి.

గతంలో యూనివర్సిటీ అడ్మిషన్, ఫీజు చెల్లించే సామర్థ్యం, అవసరమైన పత్రాలు ఉంటే వీసా వచ్చేదని విద్యార్థులు భావించేవారు. అయితే ఇప్పుడు అధికారులు విద్యార్థి ఎంచుకున్న కోర్సు, వారి గత చదువు, పని అనుభవం, భవిష్యత్తు ప్రణాళికలతో ఎలా సరిపోతుందో లోతుగా పరిశీలిస్తున్నారు. చదువు పేరుతో ఆస్ట్రేలియాకు వెళ్లి, అక్కడ స్థిరపడాలని చూస్తున్న వారిని అడ్డుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

ఉదాహరణకు, ఒక విద్యార్థి తన గత చదువుకు లేదా పని అనుభవానికి సంబంధం లేని కోర్సును ఎంచుకుంటే, దానికి తగిన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కోర్సు తన కెరీర్‌కు ఎలా ఉపయోగపడుతుందో స్పష్టంగా చెప్పలేకపోతే అధికారులకు అనుమానం కలుగుతుంది. దీంతో కేవలం అడ్మిషన్ ఉంటే సరిపోదు, తాము ఎంచుకున్న కోర్సుపై విద్యార్థికి ఒక స్పష్టమైన కథనం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ కఠిన నిబంధనల వల్ల నిజంగా చదువుకోవాలని ఆశపడే విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యా రంగంలోని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు విదేశీ విద్యార్థుల ద్వారా ఆర్థిక వ్యవస్థకు, యూనివర్సిటీలకు ఆదాయం వస్తుంది. నిబంధనలు మరీ కఠినంగా ఉంటే, విద్యార్థులు అమెరికా, బ్రిటన్, కెనడా వంటి ఇతర దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.

చదువు కోసం వచ్చే వారికి తలుపులు తెరిచి ఉంచుతూనే, వ్యవస్థను దుర్వినియోగం చేసే వారిని అడ్డుకోవడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఈ కఠిన నిబంధనలు నిజమైన విద్యార్థులను కూడా దూరం చేసే ప్రమాదం ఉందనే చర్చ ఇప్పుడు పెద్దదిగా మారుతోంది.