స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సౌమిత్ర ఝా, 'ఎథ్నిక్ గ్రోత్ ట్రాప్' (జాతిపరమైన విభజనల వల్ల కలిగే ఆర్థిక స్తబ్దత) అంశంపై చేసిన పరిశోధనకు గాను ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఫాలింగ్ వాల్స్ ఫౌండేషన్ ఏటా ఇచ్చే 'సోషల్ సైన్స్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్' పురస్కారానికి ఆయనను ఫైనలిస్టుగా ఎంపిక చేసింది.
వివిధ సామాజిక వర్గాల మధ్య ఘర్షణలను నివారించి, సహకారాన్ని పెంపొందించేందుకు ఆర్థిక మార్కెట్లు, ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ సంస్కరణలు ఎలా దోహదపడతాయో ఆయన తన ప్రాజెక్టులో విశ్లేషించారు. జాతిపరంగా విభజితమైన సమాజాలు ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలుగా మిగిలిపోవడానికి గల కారణాలను ఆయన తన పరిశోధన ద్వారా వివరించారు.
జాతిపరమైన విభజనలు, అభివృద్ధి లోపాలను అర్థం చేసుకోవడానికి ఝా ఒక కొత్త సమగ్ర భావనను, ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. చారిత్రక సంఘటనలు, ప్రస్తుత ప్రయోగాల ద్వారా సమాజాలు ఈ ఆర్థిక చిక్కుముడి నుండి ఎలా బయటపడవచ్చో ఆయన కొత్త పాఠాలను వెలికితీస్తున్నారు.







