రాష్ట్రంలో ఎరువుల విక్రయాల కోసం వ్యవసాయ శాఖ కొత్తగా 'ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్' (FFS) అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు కేవలం యూరియా కోసం మాత్రమే ప్రత్యేక యాప్‌ను అమలు చేస్తున్న ప్రభుత్వం, ఇకపై యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులను ఈ కొత్త యాప్ ద్వారానే విక్రయించాలని ఆదేశించింది. ఈ మేరకు యాప్ వినియోగంపై వ్యవసాయ విస్తరణాధికారులకు (AEOs) ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
ప్రస్తుతం అమలులో ఉన్న యూరియా యాప్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు కేంద్రం మరో యాప్‌ను వారిపై రుద్దుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షాపుల్లో ఎరువులు అందుబాటులో లేనప్పుడు, యాప్‌ల ద్వారా బుకింగ్ ఎలా సాధ్యమని రైతులు ప్రశ్నిస్తున్నారు. యూరియా పంపిణీలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం యాప్‌ల పేరుతో కొత్త డ్రామా ఆడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
కొత్తగా రానున్న FFS యాప్ అమలుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న యూరియా యాప్‌ను రద్దు చేస్తారా లేదా రెండు యాప్‌లను కలిపి వినియోగిస్తారా అనే అంశంపై అధికారులకు కూడా స్పష్టత లేదని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్‌లో యూరియాను విడతల వారీగా పంపిణీ చేసే అవకాశం ఉండగా, FFS యాప్‌లో ఒకేసారి పంపిణీ చేసేలా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎరువుల విక్రయాలు ఇకపై దుకాణాల్లో నేరుగా ఉండవు. యాప్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే షాపుల్లో ఎరువులు అందజేస్తారు. అయితే, పాత పద్ధతిలో విక్రయిస్తారా లేదా కొత్త యాప్ ద్వారానే పూర్తిస్థాయిలో అమ్మకాలు చేపడతారా అనే దానిపై ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.








