ఆంధ్రప్రదేశ్ ఖరీఫ్ 2024 సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పంట బీమా బకాయిలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన నిరంతర సంప్రదింపుల ఫలితంగానే ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైందని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే రైతులకు అందాల్సిన బీమా పరిహారాన్ని సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.

బీమా నిధుల విడుదలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని రైతులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.