భారతరత్న పురస్కార గ్రహీత ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను వెండితెరపై చూపించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈ నెల 16న ఆమె జయంతి సందర్భంగా సినిమాను అధికారికంగా ప్రారంభించబోతున్నారు.
ఈ చిత్రంలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన్న కనిపించనున్నారు. అదే రోజున రష్మిక లుక్‌తో కూడిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమాను 'జెర్సీ' సినిమాతో గుర్తింపు పొందిన గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రలో నటించేందుకు రష్మిక ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. ఈ పాత్రను తెరపై చూపించేటప్పుడు ఎలాంటి తప్పులు జరగకూడదని, ప్రతి విషయంలోనూ ప్రామాణికత పాటించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
దీనికోసం కర్ణాటక సంగీత కళాకారిణులతో కలిసి ప్రత్యేక వర్క్‌షాప్ (నైపుణ్య శిక్షణ తరగతులు) నిర్వహించబోతున్నారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాతే సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాలని చిత్రబృందం యోచిస్తోంది.
తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.






