ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు మరియు పాపికొండ నేషనల్ పార్క్ పరిధిలో తిరుగుతున్న పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు వ్యూహాలను సిద్ధం చేశారు. ఈ ఆపరేషన్ కోసం మహారాష్ట్రలోని వార్ధా, పుణే బృందాలతో పాటు, బెంగళూరుకు చెందిన ‘వైల్డ్లైఫ్ ఎస్ ఓ ఎస్’ నిపుణులు, వార్ధా నుంచి ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ ప్రతినిధులు మరియు వివిధ టైగర్ రిజర్వ్ల నుంచి అనుభవజ్ఞులను రప్పించినట్లు జిల్లా అటవీ శాఖాధికారి పి.వి. సందీప్ రెడ్డి తెలిపారు.

పులిని మత్తుమందు తుపాకీలతో బంధించడంలో నైపుణ్యం కలిగిన ఆరుగురు ట్రాంక్విలైజింగ్ షూటర్లను అందుబాటులో ఉంచారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆపరేషన్ తీరును పర్యవేక్షిస్తున్న సందీప్ రెడ్డి, పులి కదలికలు చాలా చాకచక్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. మనుషులు ఉండే ప్రాంతాలను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచెలను కూడా గమనిస్తూ, మనుషులకు చిక్కకుండా పులి తప్పించుకు తిరుగుతోందని ఆయన వివరించారు.

ప్రస్తుతం పాములవారిగూడెం, స్వర్ణవారిగూడెం, పుల్లెపూడి, అక్కంపేట, ముసన్నగూడెం, శ్రీనివాసపురం, పెద్దిపల్లి, రామచర్లగూడెం, తడువాయి, రామాన్నపాలెం, ఎ.పోలవరం, సూరంపల్లి, మాతంగిగూడెం, బోర్రంపాలెం, తిరుమలాదేవిపేట మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను మైక్ అనౌన్స్మెంట్లు, డప్పు చాటింపుల ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. కన్నాపురం, పోలవరం, కుకునూరు, జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

నిపుణుల బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తూ పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, అటవీ శాఖ జారీ చేసే సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని సందీప్ రెడ్డి కోరారు.