ప్రస్తుతం భారత ఐటీ సేవల ఆదాయం సుమారు 149 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 80 నుంచి 100 బిలియన్ డాలర్ల ఆదాయం ఇతర దేశాల కంపెనీల నుంచి వచ్చే ఔట్‌సోర్సింగ్ - అంటే తమ పనిని వేరే సంస్థలకు అప్పగించడం - ద్వారానే వస్తోంది. మొత్తం దేశీయ ఐటీ పరిశ్రమ విలువ సుమారు 315 బిలియన్ డాలర్లుగా ఉంది.
గూగుల్, మెటా వంటి పెద్ద టెక్నాలజీ సంస్థలు ఇప్పటికే ఏఐ సామర్థ్యాలను పెంచుకున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, టెస్టింగ్, సపోర్ట్ వంటి పనుల కోసం బయటి సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం వాటికి తగ్గుతోంది. ఈ మార్పు మొదట హైటెక్ రంగంపై ప్రభావం చూపుతుందని, ఆ తర్వాత బ్యాంకింగ్, రిటైల్, తయారీ, ఆరోగ్య రంగాలకు విస్తరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఒక సంస్థ తన పనిలో 15 నుంచి 20 శాతం వరకు సొంతంగా పూర్తి చేసుకుంటే, అదే స్థాయిలో బయటి కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టులు తగ్గుతాయి. ఇది భారత ఐటీ కంపెనీల ఆదాయంపైనే కాకుండా, కొత్త ఉద్యోగాల నియామకాలు, ప్రాజెక్టుల సంఖ్యపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
అయితే, ఈ పరిస్థితిని కేవలం నష్టంగానే చూడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఏఐ రంగంలో భారత కంపెనీలు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటే, ఈ సవాలే వాటికి కొత్త అవకాశంగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.








