టోలిచౌకికి చెందిన 24 ఏళ్ల అదీబా 2025 ఆగస్టులో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. కొంతకాలం తర్వాత ఆమెతో కుటుంబ సభ్యులకు సంప్రదింపులు నిలిచిపోవడంతో పాటు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో, ఆందోళన చెందిన కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.
ప్రారంభంలో టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును, ఆమె రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విదేశాలకు వెళ్లినందున ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పోలీసులకు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సేకరించిన ప్రయాణ వివరాలు, ఇతర ఆధారాలు విస్మయపరిచే నిజాలను బయటపెట్టాయి.
అదీబా 2025 నవంబర్‌లోనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆమె ఇంటికి చేరుకోకుండానే అదృశ్యం కావడంతో కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో అదృశ్యమైందన్న సమాచారం అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం మిస్సింగ్ కేసుగా దర్యాప్తు కొనసాగుతోంది. యువతి ఎవరినైనా కలిశారా లేదా స్వచ్ఛందంగా వెళ్లారా అనే కోణాల్లో సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.








