డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తున్నారని డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛను, సహకారాన్ని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఈగల్ (EAGLE) డైరెక్టర్ సందీప్ శాండిల్యతో కలిసి డీజీపీ సమీక్ష నిర్వహించారు. మాదకద్రవ్యాల నివారణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ పనితీరును ఆయన పరిశీలించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న పద్ధతులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని డీజీపీ చెప్పారు.

పోలీసుల పనితీరుపై అధికారులు కీలక గణాంకాలను డీజీపీకి వివరించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ కేసుల్లో ప్రతి కేసుకు సగటున 1.3 మందిని అరెస్ట్ చేస్తుండగా, తెలంగాణలో ఈ సంఖ్య 3.7గా ఉందని వారు తెలిపారు. పది కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోగా, అందులో ఆరింటిలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని వెల్లడించారు.

డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. థాయిలాండ్, గోవా, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్లి సరఫరా వ్యవస్థపై ఆధారాలను సేకరించినట్లు అధికారులు వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తరించిన ముఠాలపై సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు.

'నషాముక్తి తెలంగాణ - నషాముక్తి భారత్' (మత్తుపదార్థాలు లేని తెలంగాణ - మత్తుపదార్థాలు లేని భారత్) అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని డీజీపీ సూచించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులపై సమగ్రంగా దర్యాప్తు చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.