నిత్యావసర సరుకుల కోసం డిమార్ట్‌పైనే ఆధారపడే రోజులు మారుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన పలు టెక్నాలజీ యాప్‌లు మరియు మోడరన్ రిటైల్ విభాగాలు ధరల విషయంలో డిమార్ట్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లు ధరలను తగ్గించడమే కాకుండా, కస్టమర్ల సమయాన్ని ఆదా చేసే వెసులుబాట్లను కల్పిస్తున్నాయి.

షాపింగ్ రంగంలో క్విక్ కామర్స్ యాప్‌లు సృష్టిస్తున్నాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి యాప్‌లు ఆర్డర్ చేసిన 10 నుంచి 15 నిమిషాల్లోనే సరుకులను ఇంటికి చేరుస్తున్నాయి. వీటితో పాటు జియో మార్ట్ ఎంఆర్‌పీపై 40 శాతం వరకు ఆఫర్లు, ఉచిత డెలివరీని అందిస్తోంది.

బిగ్ బాస్కెట్ ఆర్గానిక్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఇస్తుండగా, అమెజాన్ ఫ్రెష్ మరియు ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ పండుగ ఆఫర్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా డిమార్ట్‌కు ప్రత్యామ్నాయాలు పెరిగాయి. విశాల్ మెగా మార్ట్‌లో దుస్తులు, హోమ్ అప్లయన్స్, కిరాణా సరుకులు డిమార్ట్ కంటే తక్కువ ధరలకే లభిస్తున్నాయి.

రిలయన్స్ స్మార్ట్ బజార్ ఒకటి కొంటే ఒకటి ఉచితం వంటి ఆఫర్లను అందిస్తుండగా, మెట్రో హోల్‌సేల్ వంటి చోట్ల బల్క్ కొనుగోళ్లపై తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు షాపింగ్ చేసే ముందు ఆన్‌లైన్ యాప్‌లలోని కార్డ్ ఆఫర్లు, ఉచిత డెలివరీ కూపన్లను, ఆఫ్‌లైన్ స్టోర్ల ధరలతో పోల్చి చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా సమయంతో పాటు ప్రతి నెలా వేల రూపాయల బడ్జెట్‌ను ఆదా చేసుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.