ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో H1N1 (స్వైన్ ఫ్లూ) కేసులు గత ఏడాది కంటే ఆరు రెట్లు పెరిగాయి. గతేడాది ఇదే సమయానికి 229 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,349 దాటింది. మారుతున్న వాతావరణం, గాలిలో తేమ పెరగడం వల్ల శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సైతం ఈ వైరస్ బారిన పడుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఆసుపత్రులకు వస్తున్న రోగుల్లో జ్వరం, దగ్గు వంటి సాధారణ లక్షణాలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొందరిలో ఆక్సిజన్ స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం, తీవ్రమైన శ్వాస సమస్యలు ఎదురవుతున్నాయని వైద్యులు పేర్కొన్నారు.
వృద్ధులు, ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైన లక్షణాలు ఉన్న వారికి సకాలంలో వైద్యం అందించడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
శ్వాస ఆడకపోవడం, ఛాతీలో తీవ్రమైన నొప్పి, నిరంతర జ్వరం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలి. పెదవులు, గోర్లు నీలం రంగులోకి మారడం వంటి సంకేతాలు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వారు కోరుతున్నారు.
దగ్గు, తుమ్ముల సమయంలో టవల్ అడ్డుపెట్టుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు ఇళ్లకే పరిమితమై ఇతరులకు దూరంగా ఉండటం మంచిది. వర్షాకాలపు తేమ వాతావరణంలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.








