డార్విన్ టెస్టు రెండో రోజు ఆటలో బంగ్లాదేశ్ బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్, బౌలర్ పరుగెత్తే మార్గంలో రావడంతో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కోపంతో ఊగిపోయాడు. వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడు బౌలర్ దారికి అడ్డుగా రావద్దని స్టార్క్ వేలు చూపిస్తూ మిరాజ్‌ను వార్నింగ్ ఇచ్చాడు.

ఈ ఘటనను గమనించిన అంపైర్ కుమార ధర్మసేన, బౌలర్ దారిలో పరుగెత్తవద్దని మిరాజ్‌ను మందలించాడు. అయితే, తనదేమీ తప్పు లేదని, బౌలరే అడ్డుగా ఉన్నాడని మిరాజ్ వాదించడంతో స్టార్క్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. 'ఇది నీ స్థలం కాదు, వికెట్ నుంచి పక్కకు జరుగు' అని స్టార్క్ మరోసారి గట్టిగా హెచ్చరించాడు.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు తంజిద్ హషన్ తమీమ్ (101), నజ్ముల్ హుస్సేన్ శాంటో (84) రాణించడంతో ఆసీస్ బౌలర్లు ఇబ్బంది పడ్డారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ 153 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉండటంతో, తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని 250 పరుగులకు పైగా పెంచుకోవాలని బంగ్లా జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.