తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘సిగ్మా’ అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయమవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
దర్శకత్వం వైపు తన ప్రయాణం గురించి జాసన్ సంజయ్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి తండ్రి షూటింగ్ సెట్స్‌కు వెళ్లడం వల్ల సినిమాలపై తనకు సహజంగానే అవగాహన పెరిగిందని తెలిపారు. తన స్నేహితులు సినిమాను వినోదంగా చూస్తే, తాను మాత్రం దాన్ని ఒక వృత్తిగా, కళగా గమనించేవాడినని ఆయన చెప్పారు. చదువు పూర్తయ్యాక విదేశాల్లో ఫిలిం మేకింగ్ కోర్సు చేస్తానని చెప్పినప్పుడు, తన తండ్రి విజయ్ అందరికంటే ముందుగా ప్రోత్సహించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న విజయ్, తన ఆలోచనల ప్రాముఖ్యతను వెంటనే అర్థం చేసుకున్నారని సంజయ్ తెలిపారు. ఫిలిం మేకింగ్‌లో కోర్సు చేయడం వల్ల ఏ విభాగం తనకు సరిపోతుందో స్పష్టత వస్తుందని తండ్రి ధైర్యం చెప్పారని ఆయన పేర్కొన్నారు. తన నిర్ణయానికి విజయ్ అందించిన మద్దతును ఆయన మరువలేనిదిగా అభివర్ణించారు.
సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, యోగ్ జేపి వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘జెన్-జెడ్ విజిలెంట్ యాక్షనర్’గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల్లో భారీ అంచనాలు ఉన్నాయి.








