ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను తమ జట్టులోకి తీసుకునేందుకు ఏడు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) యాజమాన్యం హార్దిక్ కోసం భారీ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ప్రారంభంలో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఆయుష్ మత్రేతో పాటు భారీ నగదును డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే, ఆయుష్ మత్రేను జట్టు భవిష్యత్తుకు కీలక ఆటగాడిగా భావిస్తున్న సీఎస్‌కే యాజమాన్యం అతడిని వదులుకునేందుకు నిరాకరించింది. దీంతో సీఎస్‌కే ప్రత్యామ్నాయంగా శివమ్ దూబే, డివాల్డ్ బ్రెవిస్‌లతో పాటు అదనంగా రూ. 10 కోట్ల నగదును ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మొత్తం ప్రతిపాదన విలువ రూ. 20 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
హార్దిక్ పాండ్య ఐపీఎల్ 2026 సీజన్‌లో 206 పరుగులు చేసి, నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయినప్పటికీ, అతడి నాయకత్వ లక్షణాలు, ఆల్‌రౌండర్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని సీఎస్‌కే ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్ వ్యవహారంపై ఇప్పటివరకు ఇరు జట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఒకవేళ సీఎస్‌కేతో చర్చలు విఫలమైతే, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కూడా హార్దిక్ పాండ్యను దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. కోల్‌కతాకు ప్రస్తుతం కెప్టెన్ అవసరం ఉండటంతో, వారు ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ట్రేడ్ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








