నాగర్‌కర్నూల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సరఫరా చేసిన గన్నీ బ్యాగులను రైతులకు ఉచితంగా ఇవ్వకుండా, బస్తాకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడంపై ఆయన మండిపడ్డారు.
మొక్కజొన్న కొనుగోలులో జరిగిన అక్రమాలపై ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ట్రక్ షీట్లలో 140 బస్తాల కొనుగోలు అని చూపి, కేవలం 130 బస్తాలకే డబ్బులు చెల్లించారని, మిగిలిన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. నకిలీ డీఏపీ విక్రయించిన వారిపై పీడీ యాక్ట్ (నివారణా చట్టం) నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జలాల వినియోగంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి 174 టీఎంసీల నీటిని చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చారని, తెలంగాణకు రావాల్సిన 34 శాతం వాటాలో కేవలం 22 శాతం మాత్రమే వినియోగించుకోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆల్మట్టి నుంచి జూరాలకు వరద వచ్చే అవకాశం ఉన్నందున, నార్లాపూర్, కల్వకుర్తి లిఫ్ట్ పంపులను ప్రారంభించి రిజర్వాయర్లను నింపాలని కోరారు.
ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయకుంటే, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ చిక్కొండ్ర శ్రీశైలం, హన్మంతురావు, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వెంకటయ్య, పులేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, సమద్‌పాషా పాల్గొన్నారు.








