చొప్పదండి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రకటించారు. గురువారం గంగాధర మండలం మధురానగర్‌లో ఆర్డీవో షర్మిలతో కలిసి ఆయన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. మండల కేంద్రం, మధురానగర్‌లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు.
మరోవైపు రామడుగు మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లోని సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన ఎమ్మెల్యే, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఆయన నివాళి అర్పించారు.
రామడుగు మండలంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రైతుబీమా ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో షర్మిల, మండల ప్రత్యేకాధికారి ఎం.అనిల్ ప్రకాశ్ కిరణ్, తహసీల్దార్ రాజమల్లయ్య, ఎంపీడీవో రాజేశ్వరి, డిప్యూటీ ఈఈ ఏ.రాజేంద్రప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బి.తిరుమల, సర్పంచులు పాల్గొన్నారు.







