ఛత్రపతి సంభాజీనగర్‌లోని తిస్‌గావ్ ప్రాంతంలో ఉన్న ఖావ్‌డ్యా డోంగర్ కొండ వద్ద శుక్రవారం ఈ విషాదకర ఘటన జరిగింది. దేవ్‌లై-సతారా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల కునాల్ మురళీధర్ చంద్వాడే, అతని తండ్రి మురళీధర్ చంద్వాడే, తల్లి సంగీత చంద్వాడే మరణించిన వారిలో ఉన్నారు.

ఉదయం 10 గంటల సమయంలో కునాల్ కొండపైకి చేరుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, స్థానికులు, పోలీసులు మరియు రెస్క్యూ టీం (ప్రమాదంలో ఉన్న వారిని రక్షించే బృందం) వెంటనే అక్కడికి చేరుకున్నారు.

కునాల్‌ను సురక్షితంగా తిరిగి రమ్మని అతని తండ్రి మురళీధర్ మూడు నాలుగు గంటల పాటు బతిమలాడారు. అక్కడి వారు కూడా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ కునాల్ ఎవరి మాట వినకుండా కొండ అంచున నిలబడ్డాడు.

ఒకానొక దశలో కునాల్‌ను పట్టుకోవడానికి తండ్రి దగ్గరకు వెళ్లారు. అయితే కునాల్ కొండ పైనుంచి దూకేశాడు, అతడిని కాపాడే క్రమంలో తండ్రి మురళీధర్ కూడా బ్యాలెన్స్ కోల్పోయి లోయలో పడిపోయారు. వీరిద్దరూ కింద పడగానే అక్కడికక్కడే మరణించారు.

కళ్ల ముందే భర్త, కొడుకు మరణించడంతో సంగీత తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. బాధతో ఆమె కూడా కొండ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.