నిరసనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు చర్చలకు రావాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం కోరారు. సమస్యలకు పరిష్కారం కేవలం సంభాషణల ద్వారానే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. గత 24 గంటల్లోనే ప్రభుత్వం నాలుగుసార్లు చర్చల కోసం ఆహ్వానం పంపిందని ఆయన గుర్తుచేశారు.

ఈ సమావేశానికి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నాయకత్వం వహిస్తారని జితేంద్ర సింగ్ తెలిపారు. జేపీ నడ్డా నివాసంలో లేదా కార్యాలయంలో ఎక్కడైనా చర్చలు జరిపేందుకు విద్యార్థి ప్రతినిధులే వేదికను ఎంచుకోవచ్చని, తాను కూడా ఈ సమావేశానికి హాజరవుతానని ఆయన చెప్పారు. నీట్ అంశంతో పాటు దానికి సంబంధించిన అన్ని విషయాలపై ఎంత సమయం కావాలన్నా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు.

ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని జితేంద్ర సింగ్ వెల్లడించారు. నిందితులపై వేగంగా విచారణ జరిపేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని, ఇది తుది నిర్ణయం కాదని భవిష్యత్తులో మరిన్ని చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు.

ఇది తమ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం కాదని, విద్యార్థుల సూచనలు, సలహాలను స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. చర్చలు లేకుండా పరిష్కారం దొరకదని, నిరసనకారులు తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని చర్చలకు ముందుకు రావాలని ఆయన కోరారు.