తమిళనాడు అసెంబ్లీ వేదికగా మంత్రి ఆధవ్ అర్జున డీలిమిటేషన్ ప్రక్రియపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన కంటే 'ఫ్రీజ్ డీలిమిటేషన్' అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 వద్దే స్థిరీకరించాలని, లేనిపక్షంలో ఉత్తర భారత రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఆధవ్ అర్జున పిలుపునిచ్చారు. భవిష్యత్తులో దక్షిణ భారతం నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి ఒకరు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదు, ఆరు హిందీ రాష్ట్రాలు కలిసి దేశ ప్రధానిని నిర్ణయించే పరిస్థితి రాకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సమయంలో, మంత్రి ఆధవ్ అర్జున పేరును వాడుకుని జరిగిన భారీ మోసం చెన్నైలో వెలుగుచూసింది. టీవీకే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పిస్తామని నమ్మించి, రూ. 8 కోట్లు వసూలు చేసేందుకు రూపన్ రాజ్, శక్తి అర్జున్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. మంత్రి పేరుతో నకిలీ ఈమెయిల్స్, పత్రాలను సృష్టించి వారు ఎమ్మెల్యేను బురిడీ కొట్టించేందుకు యత్నించారు.
అయితే, ఎమ్మెల్యే అనుమానం వచ్చి నిందితులతో వీడియో కాల్‌లో మాట్లాడటంతో ఈ వ్యవహారం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు, కంప్యూటర్ సీపీయూను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ మోసం వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.








