చైనాలో AI వినియోగం ఊహించని రీతిలో పెరగడంతో లేబర్ మార్కెట్ తీవ్ర సంక్షోభంలో పడింది. ముఖ్యంగా వూహాన్ నగరంలో రోబోటాక్సీల ప్రవేశం సాధారణ టాక్సీ డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసింది. అయితే, ఈ వాహనాలు సాంకేతిక లోపాల వల్ల రోడ్లపై ఆగిపోయి ట్రాఫిక్ సమస్యలు సృష్టించడంతో, అధికారులు వాటిని తాత్కాలికంగా తొలగించారు. దీంతో డ్రైవర్లకు కొంత ఉపశమనం లభించింది.

కేవలం డ్రైవర్లే కాకుండా ఆఫీసుల్లో పనిచేసే వైట్ కాలర్ ఉద్యోగులు కూడా AI ధాటికి గురవుతున్నారు. బీజింగ్‌కు చెందిన సినిమాటోగ్రాఫర్ టియాన్ జెమిన్ ఆరేళ్ల శ్రమ తర్వాత తన స్థానాన్ని ఒక AI సాఫ్ట్‌వేర్ భర్తీ చేసిందని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్, విద్య వంటి రంగాలు మందగించడంతో, ఇప్పటికే కోట్లాది మంది గిగ్ ఎకానమీ వైపు మళ్లారు. 2019లో 16 కోట్లుగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య, ఈ ఏడాదికి 32 కోట్లకు చేరుకుంటుందని ఒక థింక్‌ట్యాంక్ అంచనా వేసింది.

షాంఘైలో జరిగిన వరల్డ్ AI కాన్ఫరెన్స్‌లో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ AI అందరి అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని కొన్ని చైనా కోర్టులు తీర్పులు ఇచ్చాయి. ప్రైవేట్ రంగంపై ప్రభుత్వానికి ఉన్న నియంత్రణ దృష్ట్యా, కంపెనీలు నిర్దిష్ట సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు విధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.