బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ పరిధిలోని గాంధీనగర్, భాస్కర్‌నగర్, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లో అక్రమ ఇసుక నిల్వలు పెరిగిపోతున్నాయి. అక్రమార్కులు అర్ధరాత్రుల్లో గోదావరి నుంచి ఇసుకను తరలించి, ఖాళీ స్థలాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

వర్షాకాలం కావడంతో ఇసుకకు డిమాండ్ పెరగడంతో, ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో కనిపిస్తున్నా, రెవెన్యూ మరియు మైనింగ్ శాఖల అధికారులు మాత్రం స్పందించడం లేదు.

స్థానికుల సమాచారం ప్రకారం, సారపాకలోని కాలనీల్లో తనిఖీలు నిర్వహిస్తే సుమారు 600 ట్రిప్పుల ఇసుకను సీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, అక్రమ స్టాక్ పాయింట్లను గుర్తించి సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.