బ్రెజిల్‌లోని పరైబా రాష్ట్రంలో వరుస హత్యలకు పాల్పడుతున్న జోర్లాన్ లోపెస్ డా సిల్వాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 33 ఏళ్ల జోర్లాన్, స్థానికంగా 'దోమ' అనే పేరుతో పిలవబడేవాడు. గత మూడు నెలల కాలంలోనే ఇతడు 16 మందిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

జోర్లాన్ మారుమూల ప్రాంతాల్లో హత్యలు చేసి, వెంటనే దట్టమైన అడవుల్లోకి పారిపోయి దాక్కునేవాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఇతడు అమ్మాయిలా వేషధారణ మార్చుకుని తిరిగేవాడు. కొన్నేళ్లుగా పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఇతని కదలికలపై ప్రత్యేక బృందాలు నిఘా ఉంచాయి.

పోలీసులు జోర్లాన్‌ను పట్టుకున్న సమయంలో, అతని చేతిలో ఒక పసికందు ఉంది. ఆ బిడ్డకు, జోర్లాన్‌కు ఎలాంటి రక్తసంబంధం లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ పసికందును ఇతడు ఎక్కడి నుంచి తీసుకువచ్చాడనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

విచారణలో జోర్లాన్ తన నేరాల గురించి పలు విషయాలు వెల్లడించాడు. తాను కేవలం నేరస్థులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చంపానని, ఇది తన వ్యక్తిగత యుద్ధమని ఇతడు పోలీసుల ముందు చెప్పాడు. అంతేకాకుండా, తన 13వ ఏటనే మొదటి హత్య చేశానని కూడా ఇతడు అంగీకరించాడు.