బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ఈ మేరకు కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర కీలకం కానుండటంతో, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ మాస్కేకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆయనకు సహాయకులుగా పృతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్‌లు కో-కన్వీనర్లుగా వ్యవహరిస్తారు.
దీపక్ మాస్కే గతంలో బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి వ్యూహరచన చేశారు. ఎన్నికల డేటాను సేకరించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమాచారాన్ని విశ్లేషించడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన నాయకత్వంలో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కొత్త నివేదికలు సిద్ధం చేయనున్నారు.
పార్టీ కమ్యూనికేషన్ విభాగంలో కూడా మార్పులు చేస్తూ, అనిల్ బలూనీని మీడియా కోఆర్డినేటర్‌గా నియమించారు. ఆయనకు జాయింట్ కోఆర్డినేటర్లుగా ఆశిష్ ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారీ, సిద్ధార్థ్ యాదవ్‌లు పని చేస్తారు. వసుంధర రాజే, స్మృతి ఇరానీ, రామ్ మాధవ్ వంటి సీనియర్ నేతలకు కూడా పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది.
ఈ నియామకాలపై ప్రధాని మోదీ స్పందిస్తూ, కొత్త బృందంలో సంస్థాగత అనుభవం, క్షేత్రస్థాయి అనుసంధానం ఉన్నాయని పేర్కొన్నారు. అమిత్ మాల్వీయా కూడా కొత్త బృందానికి తన అభినందనలు తెలిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలను చూసే బీఎల్ సంతోష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు.








