బిఆర్‌ఎస్ పార్టీని సొంతం చేసుకునేందుకు హరీష్ రావు తెరవెనుక కుట్రలు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇటీవలే మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో హరీష్ రావు రహస్యంగా సమావేశమయ్యారని, ఆ సమావేశంలో పాల్గొన్న ఒక వ్యక్తి తనకు ఈ వివరాలు చెప్పారని ఆమె వెల్లడించారు. కెసిఆర్ రాజకీయ వారసత్వం కెటిఆర్‌కు దక్కకూడదని హరీష్ రావు ఆ సమావేశంలో మాట్లాడారని ఆమె ఆరోపించారు.
బిఆర్‌ఎస్‌ను తన హస్తగతం చేసుకునేందుకు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరియు బిజెపి పార్టీతో దోస్తానా చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. బిజెపితో హరీష్ రావుకు ఉన్న సంబంధాలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను బిఆర్‌ఎస్‌లో లేనని, ఆ పార్టీ ఎటు వెళ్తే తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, హరీష్ రావు తీరు గురించి ప్రజలకు తెలియజేయడానికే ఈ విషయాలను బయటపెడుతున్నానని ఆమె చెప్పారు.
తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రా వ్యక్తుల చేతిలో బందీ అయ్యారని ఆమె విమర్శించారు. బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను ఆంధ్రా వారికి కట్టబెట్టారని ఆమె ఆరోపించారు.
బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్‌గా నియమితులైన బసవరాజు శ్రీనివాస రాజు తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారని కవిత గుర్తు చేశారు. తెలంగాణ బ్రాహ్మణులలో అర్హులు ఎవరూ లేరా అని ఆమె ప్రశ్నించారు. అలాగే యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సభ్యులలో ఆంధ్రాకు చెందిన ఒక సినీ నటుడి భార్యకు పదవి ఇవ్వడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆలయంలో ఆంధ్రా వారికి పెత్తనం ఎలా ఇస్తారని ఆమె నిలదీశారు.
జనసేన పార్టీకి చెందిన ఒక ఎంపీ కుమారుడు ఆరు కోట్ల రూపాయల విలువైన కారుతో ఒడిశాకు చెందిన 25 ఏళ్ల యువతిని ఢీకొట్టి చంపిన ఘటనపై కూడా కవిత స్పందించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.








