దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పుడు ట్రైలర్ విడుదలకు మేకర్స్ సిద్ధమయ్యారు.

ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. ఆగస్టు 12న జరగనున్న ఈ వేడుకకు అభిమానులు, సినీ ప్రేక్షకులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. కుటుంబ బంధాలు, భక్తి అంశాలతో పాటు రవితేజ మాస్ ఎలివేషన్స్ ఈ ట్రైలర్‌లో ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర కనిపించనుంది. తండ్రీకూతుళ్ల మధ్య సాగే భావోద్వేగ సన్నివేశాలు ఈ కథలో కీలకంగా ఉండనున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, రవితేజ కెరీర్‌లో ఒక విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.

ట్రైలర్ విడుదలతో సినిమాపై హైప్ మరింత పెంచాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 21న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.