ఈ నెల 15న బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 15 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు స్టేషన్ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అయితే, ఎస్ఐ (సబ్ ఇన్‌స్పెక్టర్), ఇద్దరు ఏఎస్ఐలు (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు) మినహా మిగిలిన సిబ్బంది విధులకు హాజరుకాకుండా పార్టీకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
వీరంతా తాండూర్ మండలం కత్తెర్ల గ్రామ సమీపంలోని ఒక ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో రోజంతా విందు వినోదాల్లో గడిపారు. అక్కడ మహిళా సిబ్బందితో కలిసి డ్యాన్స్‌లు చేస్తూ, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను పార్టీకి హాజరైన ఒక వ్యక్తి తన మిత్రులకు పంపడంతో విషయం బయటకు వచ్చింది.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే బాధ్యతారహితంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధుల్లో ఉన్నట్లు రికార్డుల్లో చూపించి, నిబంధనలకు విరుద్ధంగా పార్టీకి వెళ్లడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
నిజంగా ఎంతమంది సిబ్బంది సెలవులో ఉన్నారు, ఎవరి అనుమతితో పార్టీకి వెళ్లారు, స్టేషన్ మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేశారా లేదా అన్న అంశాలపై విచారణ జరగాల్సి ఉంది. పోలీసులపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత అన్నది విచారణలో తేలనుంది.
ఈ ఘటనలో బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఖాకీ యూనిఫామ్‌కు ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారుల విచారణ తర్వాతే ఈ వ్యవహారంలో పూర్తి నిజాలు బయటకు రానున్నాయి.






