ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం తిప్పి పంపినట్లు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు. గతంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ (PFR) మరియు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ (TOR) పత్రాలను ఏపీకి పంపినట్లు మంత్రి పేర్కొన్నారు.
నిరుడు జూన్ 17న ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయని, దీనిపై సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) విశ్లేషణ అవసరమని కమిటీ అభిప్రాయపడింది. పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేసేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అభ్యంతర లేని ధృవీకరణ పత్రం (NOC) తప్పనిసరి అని స్పష్టం చేసింది.
గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డు నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ, ఏపీ పంపిన ప్రతిపాదనలను తిప్పి పంపినట్లు కేంద్రం తెలిపింది.








